________________
13
నేను ఎవరిని ?
మీ తప్పులే మీకు యజమానిగా తయారవుతాయి. మీలో ఉన్న ఆత్మయే భగవంతుడు. మీరు భగవత్స్వరూపమే. మీకంటె వేరుగా లేదా మీ పైన భగవంతుడు వేరే లేడు. నిన్ను నియమించే దైవీశక్తి ఏదీ లేదు. నీవు పూర్తి స్వతంత్రుడివి. నిన్ను గాయపరిచేవారుగాని నిరోధించేవారు గాని ఎవరూలేరు. నిన్ను గాయపరచగల్గింది లేదా నిరోధించగల్గింది నీ స్వయంకృతాపరాధములు మాత్రమే.
నీకు ఒక బాస్ లేకపోవటం మాత్రమే గాదు, నిన్ను బాధించగలవారు గానీ, నీ విషయంలో జోక్యం చేసికోగలవారుగానీ ఎవ్వరూ లేరు. ఎన్నో రకాల జీవులు ఉన్నప్పటికీ వాటిలో ఏదీ నీతో జోక్యానికి రాదు. ఎవరు జోక్యం చేసికొంటున్నారో వారు నీ పూర్వకర్మఫలంగానే జోక్యం చేసుకుంటున్నారు. ఇంతకు పూర్వము నీవు ఇతరుల విషయాలలో జోక్యం చేసికొన్నదానికి ఫలమే ఇపుడు నీవు అనుభవిస్తున్నావు. నేను దీనిని జ్ఞానదృష్టితో దర్శించి చూచినది చూచినట్లుగా చెప్తున్నాను.
ఈ క్రింది రెండు వాక్యాలలో నేను మనిషి మోక్షానికి గ్యారంటీయిస్తున్నాను. అవి ఏమంటే :
" ఈ ప్రపంచంలో నీకు ఎవరూ బాస్ లేరు. నీ బ్లండర్స్ మరియు మిస్టేక్స్ మాత్రమే నీకు బాస్. ఇవి రెండూ లేని పక్షంలో నీవే పరమాత్మవు.”
మరియు
“నీతో ఏవిషయంలోనైనా జోక్యం చేసికోగల వారు ఎవ్వరూ లేరు. ఈ జగత్తు ఎంత నియమబద్ధమైనదంటే ఏ జీవీ ఇంకొక జీవితో జోక్యం చేసికొన శక్తి గల్గిలేదు.”
ఈ రెండు వాక్యాలు మీ అభిప్రాయ భేదాలను, ఘర్షణలను తొలగించి మీకు శాంతిని, సహజీవనాన్ని చేకూర్చగలవు.