________________
నేను ఎవరిని ?
దృఢనిశ్చయం వల్ల నీవు ఆజ్ఞలను పాటించగల్గుతావు. మనోనిశ్చయం లేనపుడే సమస్యలు చోటు చేసుకుంటాయి. 'నేను ఆజ్ఞలలో ఉండి తీరతాను' అని నీవు నిశ్చయించుకోవాలి. అలా నిశ్చయించుకోవటం సాధ్యమే, అవునా కాదా? ఇలా దినదినమూ ఏరోజుకారోజు నిశ్చయించుకోవటం సాధ్యం కానిచో, ఒకేసారి ఒకరోజు గట్టిగా నిశ్చయించుకొని ఆ ఆజ్ఞలను దృఢంగా పాటించటం వల్ల కలిగే ఆనందాన్ని ప్రతి సమయంలోనూ ఎందుకు అనుభవించకూడదు? నేను నా ఆజ్ఞలను పాటించమని చెప్పటం లేదు. నా ఆజ్ఞలను పాటించాలనే నిర్ణయాన్ని తీసుకోమని నీకు చెప్తున్నాను.
దృఢ నిశ్చయమే ఆజ్ఞలను పాలింపజేస్తుంది. దాదాజీ ఆజ్ఞలను పాటించాలని నిశ్చయించుకోవటమే అన్నింటికంటే గొప్ప విషయం . ఆ విధంగా మీరు నిర్ణయించుకోవాలి. ఆజ్ఞలను నేను పాటించగలనా లేదా అని మీకై మీరే ఆలోచించవద్దు. ఎంతవరకు పాటించగలిగితే అంతవరకు ఖచ్చితంగా యదార్ధంగా పాటించాలి. కనీసం వాటిని పాటించాలనే నిశ్చయాన్ని కల్గి ఉండండి.
ప్రశ్నకర్త : వాటిని పూర్తిగా పాటించలేక పోయినప్పటికీ ఏమీ యిబ్బందిలేదా? దాదాశ్రీ : లేదు. పూర్తిగా లేదని కాదు. ఆజ్ఞలను పాటించే విషయంలో నీ నిశ్చయం దృఢంగా ఉండాలి. నీవు నిద్ర లేవగానే 'నేను ఆజ్ఞలలో ఉండాలి, ఆజ్ఞలను పాటించాలి' అని నిశ్చయించుకోవాలి. ఈ నిశ్చయం నిన్ను ఆజ్ఞలలో ఉంచుతుంది. అదే నేను కోరేది. నీవు ఆజ్ఞలను పాటించలేకపోవటానికి కారణాలు నాకు తెలుసు. ఏమైనప్పటికీ నీ నిశ్చయం అవసరం.
మా జ్ఞానం వల్ల తప్పక మోక్షం ప్రాప్తిస్తుంది. నీవు ఆజ్ఞలలో ఉన్నట్లయితే మోక్షం గ్యారంటీ. ఈ విషయంలో ఎటువంటి వివాదానికి తావు లేదు. ఎవరైనా ఆజ్ఞలను పాటించదల్చుకోనప్పటికీ వారు జ్ఞాన బీజాన్ని పొందినందువల్ల ఎపుడో ఒకప్పటికి అది పెరుగుతుంది. జ్ఞానాన్ని తీసుకొని ఆజ్ఞలను పాటించనివారి సంగతి ఏమిటని ప్రజలు నన్ను అడుగుతుంటారు. దాని గురించి ఆలోచించవలసిన పని వారిది కాదని నేను వారికి చెప్పాను. వారు నానుంచి జ్ఞానాన్ని పొందినందువల్ల ఆ విషయం నాకు సంబంధించినది. జ్ఞానాగ్నిలో వారి పాపాలు భస్మీభూతం చేయబడ్డాయి. వారు ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నట్లయితే ఆనందం లభిస్తుంది.