________________
నేను ఎవరిని ?
దాదాశ్రీ : అవును, ఏమీ చేయకుండా దేనినైనా పొందటం ఎలా సాధ్యం అని వారు ప్రశ్నిస్తారు. క్రోధమానమాయాలోభాలకు, రాగద్వేషాలకు నీకు నీవే స్వయంగా బందీవై వుండగా ఏ ప్రయత్నమైన చేయమని నేను నీకు చెప్పినప్పటికీ నీవు ఎలా చేయగలుగుతావు? నీవు బంధింపబడిన ఖైదీవి. నీ బంధాలను నీవే ఎలా విడిపించుకోగలవు? ఈ రోజుల్లో ఎవ్వరికీ తపస్సు చేసే శక్తి లేదు. మీకు ఈ క్రొత్త సరళ అక్రమ మార్గాన్ని చూపుటకే నేను ఇక్కడ ఉన్నాను. మీకు నేను ఈ అక్రమ మార్గాన్ని యివ్వటం మాత్రమేకాక, భారమైన తపశ్చర్యల అవసరం లేకుండా పరంపరానుగతమైన క్రమమార్గాన్ని కూడ సరళతరం చేస్తున్నాను.
ప్రశ్నకర్త : క్రమమార్గం కూడ సరళం అవుతుందా? దాదా శ్రీ : అవును, మేము క్రమమార్గాన్ని సరళతరం కూడ చేస్తాము. ఈ అక్రమ మార్గం పరిమితకాలం వరకు మాత్రమే తెరవబడి అందుబాటులో ఉంటుంది. ఈ మార్గం సాటిలేనిది. ఇది దివ్యానుగ్రహం నుంచి ప్రత్యక్షంగా లభించింది. తీర్ధంకరుల కాలంలో ఎంతో మంది ప్రజలు ప్రత్యక్ష దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ రోజుల్లో
ఆ అనుగ్రహం తమ పై ప్రసరించాలంటే ప్రజలు దివ్య దర్శన, అనుగ్రహాలకై పరితపిస్తూ రహదారిలో ఎంతగానో నిరీక్షించవలసి వచ్చేది.
కానీ యిపుడు ఆదివ్యానుగ్రహం మీపై ప్రసరించ సిద్ధంగా ఉన్నప్పటికీ (మీకు దాని పై కోరిక, శ్రద్ధ లేనందువల్ల) వెళ్లకుండా ఉండటం కోసం మీరు ఏవో సాకులు చూపుతున్నారు.
కానీ యిది అక్రమమార్గం. ప్రాపంచిక జీవనం సాగిస్తూనే మోక్షాన్ని పొందటం ఈ మార్గంలో సాధ్యమవుతుంది.
ఇది మీకు చిట్ట చివరి పాస్పోర్ట్ (కడపటి అవకాశం). దీనిని జారవిడుచుకుంటే ఇటువంటి పాస్ పోర్ట్ ఎప్పటికీ లభించదు. దీని సమయం ముగిసిపోబోతుంది. కనుక కలకాలం ఇది లభించేది కాదు. ఆ తర్వాత ధర్మం మాత్రమే మిగిలివుంటుంది. ధర్మం ద్వారా (శుభ కర్మాచరణ) పుణ్యాన్ని ఆర్జించి, కార్యకారణ సంబంధమైన జనన మరణ చక్రంలో పడవలసి వుంటుంది. అనగా ఈ జన్మలో ఆర్జించిన పుణ్యాన్ని మరు జన్మలో, మరుజన్మ పుణ్యార్జన ఫలాన్ని ఆ తర్వాతి జన్మలో అలా అనుభవిస్తూనే ఉండాలి. ఈ మార్గంలో ఆధ్యాత్మికంగా దిగజారటానికి అవకాశం చాలా ఎక్కువ.