________________
17
నేను ఎవరిని?
భగవంతుని నిజమైన చిరునామా అపుడు ఈ శాస్త్రవేత్తలు నన్ను 'దీని అర్ధం భగవంతుడు లేడు అనేనా?' అని అడిగారు. భగవంతుడు లేనట్లయితే ప్రపంచంలో ఎవరికీ సుఖం యొక్క గానీ, దుఃఖం యొక్క గానీ అనుభూతి కల్గదు. కనుక భగవంతుడు తప్పక ఉన్నాడని నేను వారితో చెప్పాను. భగవంతుడెక్కడ ఉన్నాడని వారు ప్రశ్నించారు. అతడు ఎక్కడెక్కడున్నాడని మీరు తలుస్తున్నారని నేను వారిని అడిగాను. వారు ఆకాశంవైపు తమ చేతిని చూపించారు. ఆయన పైన ఎక్కడుంటాడు? సరైన చిరునామా ఏమిటి? ఆయనకు లెటర్ పంపటం సాధ్యపడుతుందా? అనే నా ప్రశ్నలకు తమకు తెలియదని వారు సమాధానం చెప్పారు. నేను వారితో ఇలా చెప్పాను. వాస్తవానికి పైన ఎవ్వరూ లేరు. పైన భగవంతుడుంటాడని అందరూ చెప్తుంటారు కనుక నేను స్వయంగా అక్కడకు వెళ్ళి తనిఖీ చేసాను. అక్కడ భగవంతునికోసం అన్వేషించాను కానీ విశాలమైన ఆకాశం తప్ప అక్కడ ఎవరూ లేరు. అక్కడ ఎవరూ నివసించటంలేదు. శాస్త్రవేత్తలు భగవంతుని సరియైన చిరునామా నన్ను అడిగినప్పుడు నేను వారిని ఇలా వ్రాసుకోమని చెప్పాను:
“దృశ్యమూ, అదృశ్యమూ అయిన ప్రతి ప్రాణిలోనూ భగవంతుడున్నాడు. కానీ మానవుడు సృష్టించిన వాటిలో లేడు.
ఈ టేపురికార్డర్ మానవునిచే సృజింపబడినది. మానవుడు తయారుచేసిన ఏ వస్తువుల్లోనూ భగవంతుడుండడు. స్వాభావికంగా సృష్టింపబడిన అన్నింటిలోనూ భగవంతుడున్నాడు. స్థూలమైన మరియు సూక్ష్మమైన ప్రతిజీవిలోనూ భగవంతుడు విరాజమానుడై ఉన్నాడు. నీకూ నాకూ మధ్య మైక్రోస్కోపు ద్వారా కూడ చూడ సాధ్యంకాని అసంఖ్యాకమైన సూక్ష్మజీవులున్నాయి. వాటి అన్నింటిలో భగవంతుడు వసిస్తున్నాడు. భగవంతుడు ఏమి చేస్తాడు? అతడు ప్రతి ప్రాణికీ కేవలం ప్రకాశాన్నిస్తాడు. ఆ ప్రకాశాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలనేది వారివారి వ్యక్తిగతం. దానధర్మాలు చేయటం వంటి సత్కర్మలు చేసినా లేక వంచన, దొంగతనంవంటి చెడ్డపనులు చేసినా ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. భగవత్ప్రకాశాన్ని దేనికోసం ఉపయోగించు కోవాలన్నా నీకు పూర్తి స్వేచ్ఛవుంది.