________________
బాధపడేవానిదే తప్పు
8
దీనిలో న్యాయం ఎక్కడ ?
ఈ ప్రపంచంలో ప్రతిదీ ఎంతో నియమబద్ధంగా నడుస్తుంది. ఇది అబద్ధంకాదు. ప్రకృతి శాసనాలు ప్రపంచాన్ని క్రమబద్ధంగా ఉంచుతాయి. ఒక బస్సు బస్సు స్టాపుని సమీపిస్తున్న సమయంలో డ్రైవరు బస్సుపై నియంత్రణను కోల్పోయినందువల్ల బస్సుకై ఎదురుచూస్తున్న ఒక స్త్రీ మీదుగా బస్సు వెళ్లింది. ఆమె అక్కడికక్కడే మరణించింది. ప్రజాసమూహం అచ్చట చేరి బస్సు డ్రైవరుని నిందించటం, అతనిపై అరవటం ప్రారంభించారు. తన దోషం ఏమీలేకుండానే ఆ స్త్రీ చనిపోయిందని, డ్రైవరు యొక్క నిర్లక్ష్యానికి అతనిని ఖైదు చేయాలని ఉద్రిక్తులైన ప్రజలు చెప్తారు. ఆ స్త్రీ తన పూర్వ జన్మలో చేసిన తప్పు కారణంగానే మరణించిందని, ఆమె తప్పే ఆమెను ఈ రోజు పట్టుకొని శిక్షించిందని ప్రజలు గ్రహించరు. డ్రైవరుని అతని దోషం పట్టిచ్చినపుడు డ్రైవరు శిక్షింపబడతాడు.
అతడికి న్యాయస్థానం వుంది. అక్కడ అతను దోషిగా నిరూపించబడవచ్చు, లేకపోవచ్చు. పూర్వపు ఖాతా లేకుండా ఎవరూ ఎవరినీ బాధించలేరు. ఆ స్త్రీ తన పూర్వపు ఖాతాను సెటిల్ చేసికొంది, అనగా గతంలో చేసిన కర్మకు ఫలం అనుభవించింది. ఈ సంఘటనలో బాధపడింది స్త్రీకనుక దోషం ఆమెదే అని నీవు గ్రహించాలి. డ్రైవరు పట్టుబడినపుడు అతను దోషి అవుతాడు. ఈ రోజున ఎవరు పట్టుబడితే వారిదే దోషం.
ఇటువంటి సంఘటనలను చూసినపుడు కొంతమంది భగవంతుడు లేడనే నిర్ణయానికొస్తారు. మరి కొంతమంది భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోతారు. భగవంతుడు ఇలా ఎందుకు జరగనివ్వాలి? అని వారు ప్రశ్నిస్తారు. ఈ ప్రజలు సత్యాన్ని గ్రహించటంలేదు. ఇవన్నీ వారివారి ఖాతాల ప్రకారమే జరుగుతున్నాయని, వారి వారి దోషాలనుంచి ముక్తులౌతున్నారని ప్రజలు అర్థం చేసికోవటం లేదు. ఈ ఖాతాలు కేవలం ఈ ఒక్క జన్మకి సంబంధించినవి కావు. ప్రకృతి శాసనాలు న్యాయపూర్ణమైనవి. ఆ స్త్రీ బస్సు క్రింద నలిగి చనిపోవటం కూడా న్యాయమే. ఈ ప్రపంచం పూర్తిగా న్యాయబద్ధమైనది.