________________
23
బాధపడేవానిదే తప్పు
తప్పుకి మూలం ఎక్కడ? ఇది ఎవరి తప్పు? తప్పు బాధపడేవానిది. ఆ తప్పు ఏమిటి? 'నేను చందూలాల్' అనే నమ్మకమే ఆ తప్పు. నిజానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ దోషులుకారు కనుక ఎవరిని నిందించకూడదు. ఇది నిజం.
ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏమీ చేయగల శక్తి లేదు. ఒకరు ఇంతకు పూర్వమే ఏఏ ఖాతాలను (కర్మలను) సృష్టించుకొన్నారో అవే అతనిని బంధిస్తాయి. నీవు ఏఏ ఖాతాల చిక్కులను సృష్టించుకొన్నావో అవి వాటి ఫలాలను యిచ్చేవరకు నిన్ను వదలి పెట్టవు. కాని యిప్పటినుంచి కొత్తగా ఏ చిక్కు ఖాతాలను సృష్టించుకోకు. నీకు ఇది తెలిసింది కనుక ఇపుడు ఆ సృష్టిని ఆపగలవు. నీవు యిప్పటికే సృష్టించుకొన్న పాత ఖాతాలను పూర్తి చేసికొనవలసి ఉన్నది. కానీ కొత్త వాటిని సృష్టించుకోకుండా జాగ్రత్తపడు. నీకు సంబంధించినంతవరకు పూర్తి బాధ్యత నీదే. అది భగవంతుని బాధ్యత కాదు. భగవంతుడు దీనిలో జోక్యం చేసికోడు కనుక భగవంతుడు కూడా క్షమాభిక్షను ప్రసాదించలేడు. చాలామంది భక్తులు తాము పాపం చేసినప్పటికీ భగవంతుడు తమని క్షమిస్తాడని విశ్వసిస్తారు. భగవంతుని నుంచి క్షమ అనేది
ఉండదు. దయార్ద్రహృదయులు క్షమిస్తారు, నీవు దయార్ద్రహృదయుడైన ఒక వ్యక్తిపట్ల గావించిన ఘోరఅపరాధాన్ని ఆ వ్యక్తి వద్ద ఒప్పుకొన్నచో అతడు నిన్ను వెంటనే క్షమిస్తాడు.
నీకు బాధను కలుగచేసిన వ్యక్తి కేవలం నిమిత్త మాత్రుడు. ప్రధాన దోషం మీదే. నిన్ను గాయపరచినవారు లేక నీకు సంతోషాన్ని కల్గించినవారు ఇరువురూ నిమిత్తమాత్రులే. ప్రతిదీ నీగత ఖాతాల కారణంగానే జరుగుతుంది.
నీ జీవితంలో జోక్యం చేసుకొనే శక్తి ఎవ్వరికీ లేదు, దీనిని నేను చాలా స్పష్టంగా, నిష్కపటంగా చెప్తున్నాను. కాని నీ దోషం ఉన్నట్లయితే అపుడు ఎవరైనా జోక్యం చేసుకోగల్గుతారు. వారు నిన్ను కొట్టినా కొట్టవచ్చు. మీ బాధల వెనుక ఉన్న కారణాలు నాకు తెలుసు. ఈ కారణాలకు బాధ్యుడవు నీవే, వాటి సృష్టికర్తవు నీవే. ఎవరూ నిన్ను గాయపరచలేదు. నిన్ను నీవే గాయపర్చుకొన్నావు. నీ ప్రాపంచిక జీవితానికి నీవే పూర్తిగా బాధ్యుడవు.