________________
బాధపడేవానిదే తప్పు
ప్రశ్నకర్త : నా జీవితంలో ఆలస్యంగానైనా నేను దీనిని గ్రహించాను. దాదాశ్రీ : ఇపుడైనా అర్ధం చేసుకొన్నారు అదే మేలు. ఆలస్యంగానైనా అర్ధం చేసికోవటం మంచిది. నీవయసు మీద పడినప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ ఈ సూత్రాన్ని నీవు చాలా త్వరగానే గ్రహించావు. ఇదెంత ప్రయోజనకారి! నీవు వయసులో ఉన్నపుడు, బలంగా ఉన్నపుడు దీనిని నీవు తెల్సుకొని వుంటే అది నీకు ఎంత మేలు చేసి వుండేదో ఊహించు.
“బాధపడే వానిదే తప్పు” అనే ఈ ఒక్క సూత్రంలో నేను మీకు సమస్త శాస్త్రాల సారాన్ని అందించాను.
బొంబాయిలోని వేలకుటుంబాలు ఈ వాక్యాన్ని తమదైనందిన జీవితాలలో చేర్చుకొన్నారు. వారియిళ్లలో గోడల పై ఈ సూత్రం పెద్ద అక్షరాలలో వ్రాసి ఉండటాన్ని మీరు చూడవచ్చు. యింట్లో ఏదైన పగిలిపోయినపుడు పిల్లలు తల్లి ముఖకవళికలను బట్టి తప్పు ఆమెదే అని తమ తల్లికి గుర్తుచేస్తారు. కూరలో ఉప్పు చాలా ఎక్కువైనపుడు తప్పు ఎవరిదో తెలుసుకోవటానికి భుజించేవారి ముఖవికారాలను గమనించాలి. ఎవరి ముఖం వికృతమైతే వారిదే తప్పు. చారుగిన్నె చేయిజారి క్రింద పడితే, ఎవరిముఖంలో విసుగు కన్పిస్తుందో వారిదే తప్పు. బాధపడే వానిదే తప్పు.
ఎవరిముఖమైనా చాలా కోపంగా ఉన్నట్లు నీకు కన్పిస్తే అది నీ తప్పు. ఆ సమయంలో ఆ వ్యక్తిలోని శుద్ధాత్మను ప్రార్ధించి, మరల మరల క్షమాపణకై అర్ధించాలి. అపుడు ఆ వ్యక్తితో నీకుగల ఋణానుబంధం నుంచి నీవు విడుదలపొందుతావు. ప్రజలు తమ స్వంత తప్పుల కారణంగానే బాధపడతారు.
రాయివిసిరిన వ్యక్తిది తప్పుకాదు, దానివల్ల గాయపడినవానిదే తప్పు. నీ చుట్టూ ఎంత అల్లరి పిల్లలు ఉన్నప్పటికీ, వారెంత కుచేష్టలు చేసినప్పటికీ అవి నిన్ను బాధించకపోతే అపుడు తప్పు నీది కాదు. అవి నిన్ను ప్రభావితం చేస్తే అపుడు తప్పు నీదని నీవు నిశ్చయంగా గ్రహించాలి.