________________
బాధపడేవానిదే తప్పు
దోషం ఎవరిది? నేరస్తునిదా లేక
నేరానికి బలియైన వానిదా? ప్రతిరోజూ వార్తాపత్రికలలో దొంగతనాలు, దోపిడీల గురించి నీవు చదువుతుంటావు. వాటిని చదివి మనకి కూడ అలా జరుగుతుందేమోనని చింతించవలసిన పనిలేదు. చదివిన విషయాలను గురించిగాని, వేరే విషయాలను గురించిగాని నెగెటివ్ ఆలోచనలను రానీయకూడదు. ఇది చాలా తప్పు, మనోవికల్ప దోషం. దీనికి బదులుగా నిశ్చింతగా,
సహజంగా ఎందుకు జీవించకూడదు? నీ గతకర్మఖాతాలో ఉంటేనే నీవు దోపిడీకి గురవుతావు. నీ ఖాతాలో లేనిచో, ఈ ప్రపంచంలో ఎవరూ నీ జోలికి రాలేరు. అందువల్ల నిర్భయుడవై యుండు. వార్తాపత్రికలు ఏ విషయాలనైనా వ్రాస్తాయి. నీవు వాటికి భయపడకూడదు. వేలకొలది ప్రజలు దోపిడీకి గురి అయినప్పటికీ ఆ విషయం నిన్ను కలవర పెట్టకూడదు.
నీపై ఏ ఒక్కరికీ అధికారం లేదు. ఒకవేళ నీవు దోపిడికి గురికావటం జరిగితే బాధపడుతున్నది ఎవరు? అని నీవు ప్రశ్నించుకోవాలి; సాగిపోవాలి. దొంగ కలిసాడు, దోచుకున్నాడు. దానికి బాధపడకుండా పూర్వపు ఖాతా పూర్తయిందని గ్రహించి నీవు ముందుకు సాగిపోవాలి.
ఈ ప్రపంచం దు:ఖానుభవం కోసం కాదు. సుఖానుభవం కోసం ఉద్దేశింపబడింది. ప్రజలు తమతమ కర్మఖాతాలననుసరించి ఫలాలను పొందుతారు. కొంత మంది సదా సుఖాన్నే అనుభవిస్తు ఉండగా మరికొంతమంది కేవలం దు:ఖాలను అనుభవిస్తారు. దీనికి కారణం ఏమిటి? వారు తమతో తెచ్చుకొన్న కర్మఖాతాలే కారణం.
“బాధపడే వానిదే తప్పు" అనే ఈ సూత్రాన్ని చాలా మంది పెద్ద పెద్ద అక్షరాలతో తమ యిళ్లలో గోడల పై వ్రాసుకొన్నారు. ఎపుడైనా వారికి దు:ఖానుభవం కలిగితే తప్పు ఎవరిది? అనే విషయాన్ని ఈ సూత్రం వారికి గుర్తు చేస్తుంది.
ఎవరైనా సరే జీవితాంతం, జీవితంలోని ప్రతి సందర్భంలో ఈ వాక్యాన్ని గుర్తుంచుకొని, సరైన అవగాహనతో దీనిని అన్వయించుకొన్నచో అతనికి వేరే గురువు యొక్క అవసరం లేదు. అతనిని మోక్షానికి తీసికెళ్లటానికి ఈ వాక్యం చాలు.