________________
సంపాదకీయం వేలకొలది యాత్రికులు భారతదేశంలోని బదరీనాధ్ మరియు కేదారనాధ్ వెళ్తూ అక్కడ మార్గమధ్యంలో అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా వందలమంది సజీవంగా సమాధి అయ్యారు. ఇటువంటి వార్త విన్నపుడు ఎవరి హృదయమైన ద్రవీభూతమౌతుంది. “ఎంతో భక్తి భావంతో భగవద్దర్శనానికై వెళ్తున్న వారిని భగవంతుడు ఎంత అన్యాయంగా చంపివేశాడు” అనే భావం చాలా మందికి కలుగుతుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తిని ఇద్దరు సోదరులు పంచుకొనే విషయంలో ఒకనికి ఎక్కువభాగం, రెండవ వానికి తక్కువ భాగం లభిస్తుంది. అపుడు బుద్ది న్యాయం కోసం అర్ధిస్తుంది. ఆ పోరాటం క్రింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. లభించిన వాటిలో అధికభాగం కోర్టు ఖర్చుల నిమిత్తం పోగా వారికి లభించే ఫలం దు:
ఖమే అవుతుంది. నిర్దోషి జైలు శిక్షననుభవింప వలసి వస్తుంది. దోషి సమాజంలో పెద్దమనిషిగా చలామణి అవుతాడు. ఇదెక్కడి న్యాయం? నిజాయితీ పరుడు దు:ఖితుడు కాగా, అవినీతి పరుడు భవంతులు నిర్మించి, వాహనాలలో తిరుగుతుంటాడు. ఏ విధంగా ఇది న్యాయం అనిపించుకొంటుంది?
బుద్ది న్యాయానికై ప్రాకులాడటం, ఫలితంగా దుఃఖితుడైన వ్యక్తి మరింత దు:ఖితుడు కావటం, ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. పరమ పూజ్య దాదా శ్రీ అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని కనుగొన్నారు. అది ఏమంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడ అన్యాయం అనేది జరగనే జరగదు. ఏమి జరిగినా న్యాయమే జరుగుతుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా న్యాయాన్ని అధిగమించదు. ఏ ప్రభావానికైనా లోను కావటానికి ప్రకృతి ఒక వ్యక్తిగాని భగవంతుడు గాని కాదు. ప్రకృతి అంటే సైంటిఫిక్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్సెస్. ఒక కార్యం పూర్తి అగుటకు ఎన్నో పరిస్థితులు సక్రమముగా (సరియైనవిగా) ఉండాలి. వేల కొద్దీ ఉన్న యాత్రికులలో వారు మాత్రమే ఎందుకు మరణించారు? ఎవరెవరి ప్రారబ్దంలో ఆ విధంగా లిఖించబడివుందో వారు మాత్రమే ఆ దుర్ఘటనకు గురి అయి హిమపాత కారణంగా మృత్యువాత పడ్డారు. ఒక సంఘటనకు దారి తీసే కారణాలు ఎన్నో ఉంటాయి. ఒక దుర్ఘటనకు దారితీసే కారణాలూ ఎన్నో ఉంటాయి. మన ప్రారబ్దం లేకుండా ఒక దోమ కూడ కుట్టదు. పూర్వ కర్మల ఫలమే ఇప్పటి శిక్ష. అందువల్ల మోక్షాన్ని కాంక్షించేవారు అర్ధం చేసికోవలసిన విషయం ఏమంటే తనకి జరిగినది ఏదైనా న్యాయమే అని.
“ఏది జరిగితే అదే న్యాయం” ఇదే జ్ఞాని యొక్క సూత్రము. ఈ జ్ఞాన సూత్రాన్ని తమ జీవితంలో ఎంతగా అన్వయించుకుంటే అంతగా శాంతి లభిస్తుంది. ప్రత్యేకించి ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడ అంతరంగంలో శాంతికి ఎటువంటి చలనం కలగదు.
డా|| నీరూబెన్ అమీ