________________
అనువాదకుని విజ్ఞప్తి
అంబాలాల్ ఎమ్. పటేల్ నామధేయులైన జ్ఞానిపురుషుని దాదా శ్రీ లేక దాదా లేక దాదాజీ గా భక్తులందరూ పిలుస్తారు. ఆత్మ విజ్ఞాన సంబంధమైన మరియు ప్రపంచ వ్యవహార జ్ఞాన సంబంధమైన తన సత్సంగాన్ని యధాతధంగా అనువదించటం సాధ్యం కాదని ఆయన తరచూ చెప్పేవారు. అనువాద క్రమంలో లోతైన, సహేతుకమైన అర్ధం ముముక్షువులకు అందకపోవచ్చు అనికూడా దాదాశ్రీ చెప్పేవారు. గుజరాతీ భాషని నేర్చుకోవటంలోని ప్రాముఖ్యతను ఆయన నొక్కి వక్కాణించేవారు. తద్వారానే దాదాశ్రీ అమూల్యమైన బోధల సంపూర్ణసారాన్ని యధాతధంగా గ్రహించే అవకాశం ఉంటుందని దాదా మాటల సారాంశం.
అయినప్పటికీ దాదాశ్రీ తన బోధలను ఇంగ్లీషు మరియు ఇతర భాషలలోకి అనువదించటానికి, తద్వారా ప్రపంచంలోని యావత్తు ప్రజానీకానికి అందించటానికి తమ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. తనలో ప్రకటితమైన ఈ అక్రమ విజ్ఞానాన్ని ప్రపంచంలోని మానవాళి పొంది తమ బాధలనుంచి విముక్తి పొందాలని, జీవన్ముక్తిని అనుభవించాలని దాదాజీ యొక్క ప్రగాఢమైన వాంఛ. ఈ విజ్ఞానం యొక్క అద్భుతమైన శక్తులను ప్రపంచం గుర్తించి ప్రణమిల్లే రోజు వస్తుందని కూడా దాదాజీ చెప్పారు.
జ్ఞానిపురుషులైన దాదాశ్రీ బోధలను తెలుగుభాష ద్వారా తెలుగు ప్రజలకు అందించటం కోసం చేసిన చిన్న ప్రయత్న ఫలమే ఈ పుస్తకం యొక్క అనువాదం. యధాతధంగా అందించలేకపోయినా సత్సంగ సందేశాన్ని, భావాన్ని ఎటువంటి చెఱుపు లేకుండా అందించడంకోసం ఎంతో శ్రద్ధ వహించటం జరిగింది.
అనంతమైన దాదాజీ జ్ఞాన ఖజానాకి ఇది ప్రాధమిక పరిచయం మాత్రమే. ఈ అనువాదంలో ఏమైన తప్పులు దొర్లివుంటే అవి పూర్తిగా అనువాదకులవే అని గమనించగలరు. వాటినిమిత్తమై మేము మీ క్షమను అర్ధిస్తున్నాము.