________________
సంపాదకీయం “ఏవాయిడ్ క్లాషెస్” (ఘర్షణకు దూరంగా ఉండండి) ఈ ఒక్క సూత్రాన్ని జీవితంలో అమలు పర్చుకోగల్గితే జీవితం చాలా సుందరంగా ఉంటుంది. మోక్షం మన దగ్గరకి నడిచి వస్తుంది. ఇందులో సందేహం లేదు.
అక్రమ విజ్ఞాని (షార్టు మార్గము ద్వారా ఆత్మానుభవం కలిగించే జ్ఞాని) పూజ్యశ్రీ దాదాజీ ద్వారా ప్రసాదించబడిన ఈ సూత్రాన్ని అన్వయించుకొని ఎంతోమంది సంసార సాగరాన్ని దాటగలిగారు. వారి జీవితం సుఖశాంతిమయం అవ్వటమే కాక, వారు మోక్షానికి బాటకూడ వేసికొన్నారు. అందుకై మనం చేయవలసింది ఒక్కటే. “నేను ఎవరితోనూ వివాదానికి దిగకూడదు. ఎదుటివ్యక్తి ఘర్షణకు దిగటానికి లక్ష ప్రయత్నాలు చేసినా సరే ఎట్టి పరిస్థితిలోనూ నేను ఆ ప్రయత్నాలకు లొంగకూడదు” అని దృఢ నిశ్చయం చేసికోవాలి. ఆ విధంగా నిశ్చయించుకొంటే చాలు వివాదాలకు దూరంగా ఉండటానికి తగిన జాగృతి లభిస్తుంది.
రాత్రిపూట చీకట్లో బయటకు వెళ్ళవలసి వచ్చి మనం గోడకు గుద్దుకుంటే ఏమిచేస్తాం? “నాదారిలో నువ్వు ఎందుకు వచ్చావు? నా దారికి అడ్డు తొలగు. ఇది నా యిల్లు” అని అరచి గోడను కొడతామా? లేదు కదా! దానికి బదులుగా ఎంతో తెలివిగా చీకట్లో చేతులతో తడుముకుంటూ ద్వారాన్ని చేరతాం. ఎందుకు? మనకు తెలుసు నిర్లక్ష్యంగా వెళితే తలబొప్పికడ్తుంది అని.
ఒక సన్నని ఇరుకు మార్గంలో రాజు వెళ్తుండగా ఒక ఎద్దు ఎదురుగా పరుగెత్తుకుంటూ వచ్చింది. రాజు తప్పుకొని దానికి దారి యివ్వవలసే వస్తుంది. “నేను ఈ ప్రాంతానికి రాజును. నా దారికి అడ్డు తొలగు” అని రాజు ఎద్దుతో చెప్పటం వలన ప్రయోజనం ఉ ంటుందా? అటువంటి పరిస్థితి ఎదురైనపుడు మహారాజైనా, చక్రవర్తి అయినా సరే తాను తొలగి పరుగెత్తుకొని వస్తున్న ఎద్దుకు దారి యివ్వక తప్పదు. ఎందుకు? గాయాలనుంచి, దెబ్బల నుంచి తప్పించుకోవటం కోసం. .
ఈ చిన్న ఉదాహరణల నుంచి గ్రహించవలసినది ఏమంటే మనతో ఎవరైనా ఘర్షణకు తలపడితే వారు గోడతోనో లేక ఎద్దుతోనో సమానం. అందువల్ల మనల్ని మనం కాపాడుకోవాలనుకొంటే, ఎవరితోనూ ఘర్షణ పడకుండా అటువంటి వారి మార్గం నుండి తప్పుకోవాలి. జీవితంలో సర్వకాల సర్వావస్థలలోనూ సంఘర్షణలకు దూరంగా ఉండాలి. ఎక్కడైనా సంఘర్షణ వస్తే, దాని నుండి వైదొలగండి. అలా చేయటం వలన జీవితం కేశరహితమౌతుంది. మరియు మోక్షం ప్రాప్తిస్తుంది.
డా॥ నీరూబెన్ అమీన్