________________
పరమపూజ్య దాదా శ్రీ గ్రామ గ్రామమూ, దేశవిదేశాలు పర్యటించి ముముక్షువులకు సత్సంగంతోపాటు ఆత్మజ్ఞాన ప్రాప్తిని కలిగించారు. దానితోపాటు సంఘీభావంతో కూడిన ప్రాపంచిక వ్యవహర జ్ఞానాన్ని కూడా తనను కలిసిన వారందరికీ అందించారు. ఆయన తన అవసానదశలో, 1987 చివర్లో తన కార్యాన్ని కొనసాగించే నిమిత్తం డాక్టరు నీరుబెన్ అమీన్ కి సిద్ధులను అనుగ్రహించారు.
పరమపూజ్య దాదా శ్రీ జనవరి 2, 1988న దేహత్యాగం చేసిన తర్వాత డా॥ నీరుబెన్ భారతదేశ గ్రామాలలోనూ, పట్టణాలలోనూ, ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలలోనూ పర్యటిస్తూ దాదాశ్రీ కార్యాన్ని కొనసాగించారు. మార్చి 19, 2006న దేహత్యాగం చేసేవరకు ఆమె అక్రమవిజ్ఞాన్ కి దాదా శ్రీ ప్రతినిధిగా వున్నారు. దేహ త్యాగానికి ముందు ఆమె ఆ కార్యభారాన్ని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ కి అప్పగించారు. ఆధునిక కాలంలో ఆత్మానుభూతికి సరళమూ మరియు డైరెక్ట్ మార్గం ద్వారా అక్రమ విజ్ఞానాన్ని వ్యాపింపచేయటంలో డా. నీరుబెన్ సాధనం అయి ప్రముఖ పాత్రను పోషించారు. లక్షల కొలది ముముక్షువులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. వారు తమ సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా స్వేచ్ఛను, శాంతిని, ఆత్మరమణత యొక్క అనుభూతిని పొందుతున్నారు.
అక్రమ విజ్ఞాన సత్సంగం నిర్వహించే నిమిత్తం జ్ఞాని పురుష్ దాదా శ్రీ పూజ్య నీరుబెన్ అమీన్ సమక్షంలో శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ కి సిద్ధిని ప్రదానం చేశారు. 1988-2006 మధ్యకాలంలో దాదా శ్రీ దిశానిర్దేశానుసారం, డా. నీరుబెన్ అమీన్ నాయకత్వంలో దేశవిదేశాలలో శ్రీ దీపక్ భాయ్ సత్సంగ్ నిర్వహించారు. ఈ అక్రమ విజ్ఞాన్ యొక్క జ్ఞానవిధులు, సత్సంగ్ లు ఇపుడు పూర్తిస్థాయిలో ఆత్మజ్ఞాని శ్రీ దీపక్ భాయ్ దేశాయ్ మాద్యమం ద్వారా కొనసాగుతున్నాయి.
శాస్త్రాలలోని శక్తివంతమైన పదాలు మోక్షకాంక్షను వృద్ధి చేయటంలో సహకరిస్తూ ఆ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ముముక్షువులందరికీ ఆత్మజ్ఞానమే అంతిమ లక్ష్యం. స్వరూప జ్ఞానం లేకుంటే మోక్షం లేదు. ఈ జ్ఞానం పుస్తకాలలో లభించదు. అది జ్ఞాని హృదయంలో వుంటుంది. కనుక ఆత్మజ్ఞానాన్ని ప్రత్యక్షజ్ఞాని నుంచి మాత్రమే పొందగలం. అక్రమ విజ్ఞాన్ యొక్క విజ్ఞాన ప్రయోగం ద్వారా ప్రత్యక్ష జ్ఞానినుంచి నేడుకూడ ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఒక జ్యోతి మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు.
*
*
*
*