________________
జ్ఞాని పురుషుని యొక్క పరిచయం అది 1958వ సంవత్సరం జూన్ నెలలో ఒకనాటి సాయంత్రం సుమారు ఆరు గంటల సమయం, పశ్చిమ భారత దేశంలోని దక్షిణ గుజరాత్ లోని ఒక పట్టణమైన సూరత్ రైల్వే స్టేషను. అంబాలాల్ మూజ్ భాయ్ పటేల్ నామధేయుడు, వృత్తి రీత్యా కాంట్రాక్టరూ అయిన ఒక గృహస్థుడు జనసమూహంతో రద్దీగా వున్న సూరత్ స్టేషన్లోని మూడవ నెంబరు ప్లాట్‌ఫాం బెంచి పైన కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో నలభై ఎనిమిది నిమిషములపాటు ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా అంబాలాల్ మూల్ జీ భాయ్ పటేల్ లోని ఆత్మ సాక్షాత్కారమైంది. ఆ సమయంలో అతని అహంకారం సమూలంగా దగ్ధమైపోయింది. ఆ క్షణం నుంచి అతను అంబాలాల్
యొక్క ఆలోచనలు, వాక్కు మరియు క్రియలన్నింటినుంచి పూర్తిగా వేరుచేయబడి, జ్ఞాన మార్గం ద్వారా మానవాళికి ముక్తిని ప్రసాదించే నిమిత్తం భగవంతుని చేతిలో సజీవ పరికరంగా మారారు. ఆయన తనకు ప్రకటితమైన పరమాత్మని దాదాభగవాన్ అని పిలిచారు. “ఈ పరమాత్మ, దాదాభగవాన్ నాలో పూర్ణరూపంలో వ్యక్తమైనాడు; మీలో అవ్యక్తంగా ఉన్నాడు. భేదం ఇంతమాత్రమే. ఆయన జీవులందరిలోను విరాజమానుడై ఉన్నాడు.” అని తనను కలిసిన ప్రతి ఒక్కరితోనూ చెప్పేవారు.
మనం ఎవరము? భగవంతుడంటే ఏమిటి? జగత్తును ఎవరు నడిపిస్తున్నారు? కర్మ ఏమిటి? మోక్షం ఏమిటి? ఇత్యాది సమస్త ఆధ్యాత్మిక ప్రశ్నలకు ఆ సందర్భంలో సమాధానం లభించింది. ప్రకృతి శ్రీ అంబాలాల్ మూజ్ భాయ్ పటేల్ ద్వారా ప్రపంచానికి సంపూర్ణ తత్త్వ రహస్యాన్ని వెల్లడిచేసింది.
శ్రీ అంబాలాల్ జన్మస్థలం బరోడాపట్టణ సమీపంలోని తారాసలి; పెరిగింది గుజరాత్ లోని బాదరణ్ గ్రామం. ఆయన ధర్మపత్ని హీరాబా. వృత్తిరీత్యా కాంట్రాక్టరు అయినప్పటికీ ఆత్మసాక్షాత్కారం పొందటానికి ముందు కూడా అతని వ్యావహారిక జీవనం ఇంట్లోను, చుట్టు ప్రక్కలవారితోను కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉండేది. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత జ్ఞానిగా ఆయన జీవితం ప్రజలకే అంకితమైంది.